జాతీయ అనువాద సమితి గురించి

జాతీయ అనువాద సమితి (జాఅస) అనేది అనువాద పరిశ్రమను స్థాపించడానికీ ఉన్నత విద్యా సంబంధ జ్ఞాన పాఠ్య పుస్తకాలను భారతీయ భాషలలో విద్యార్థులకు, విద్యావేత్తలకు అందజేయడానికీ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ప్రణాళిక. భాషాపరమైన అడ్డంకులను దాటి ఒక జ్ఞాన సమాజాన్ని సృష్టించాలనేది ఈ సమితి సంకల్పం. అనువాదం ద్వారా రాజ్యాంగం యొక్క 8వ అధికరణలో సూచించిన అన్ని భారతీయ భాషలలో జ్ఞాన ప్రసారణ చెయ్యాలనేది జాఅస ఆశయం.

అనువాదకులకు అనువాదం గురించి అవగాహన కల్పించడానికి, ప్రచురణకర్తలు అనువాదాలను ప్రచురించేలా ప్రోత్సాహపరచడానికి, భారతీయ భాషల నుంచి భారతీయ భాషలలోకి లేదా భారతీయ భాషల మధ్య ప్రచురించిన అనువాదాల సమాచారనిధులను నిర్వాహించడానికి, అనువాదాలకు సంబంధించిన సమాచారానికి ఆదానప్రదానకార్యాలయంగా ఉండేందుకు జాఅస ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాల ద్వారా జాఅస భారతదేశంలో అనువాదాన్ని ఒక పరిశ్రమగా స్థాపించాలని అనుకుంటుంది. అనువాదం ద్వారా కొత్త పారిభాషిక పదావళులు, ప్రసంగ శైలులను ఆధునికీకరించేందుకు తోడ్పడుతుందని ఆశిస్తుంది. ఈ ఆధునికీకరణ ప్రక్రియలో అనువాదకులు ముఖ్య పాత్ర పోషిస్తారు, ప్రత్యేకించి భారతీయ భాషలలో విద్యా సంబంధిత ప్రసంగాల సందర్భాలలో.

అనువాదాన్ని పరిశ్రమగా స్థాపించే ఆశయానికి జ్ఞాన పాఠ్య పుస్తకాల అనువాదాలు తొలి మెట్టు. జ్ఞాన ప్రసారణ కోసం జాఅస ఎంచుకున్న పాఠ్య సామగ్రి అంతా జ్ఞాన పాఠాల పాఠ్య సంకలనాలుగా నిక్షిప్తం చేస్తుంది. ప్రస్తుతానికి, జాఅస ఉన్నత విద్యకు సంబంధించిన బోధనా సామగ్రిని 22 భారతీయ భాషలలోకి అనువాదం చేసే పనిలో నిమగ్నమై ఉంది. చాలామటుకు ఇంగ్లీషులోనే అందుబాటులో ఉన్న ఉన్నత విద్యా పాఠ్యాలను భారతీయ భాషలలోకి అనువదించడం ద్వారా జాఅస సమాజంలోకి ఒక పెద్ద జ్ఞాన సంపదను తీసుకురావాలని ఆశిస్తుంది. ఈ ప్రయత్నం, క్రమంగా ఒక సంఘటిత జ్ఞాన సమాజానికి దారి తీస్తుంది.