ప్రస్తావన

భారతదేశంలో అనువాదాల చరిత్ర అస్తవ్యస్తంగా ఉంది. తొలిదశలో అనువాదాలు సంస్కృత, ప్రాకృత, పాళీ భాషల మధ్య జరిగినట్లనిపిస్తుంది. ఆయా ప్రాంతాలకు చెందిన భాషల మధ్యన, అదే భాషలలోనే జరిగి ఉండవచ్చు. అరబిక్ , పర్షియన్ భాషలో కూడా. భారతీయ కథనాత్మకాలు, జ్ఞాన గ్రంథాలు అంటే పంచతంత్రం, అష్టాంగ హృదయం, అర్థశాస్త్రం, హితోపదేశం, యోగసూత్రం, రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటివి 8 వ - 19 వ శతాబ్దాల మధ్యలో అరబిక్ లోనికి అనువదించబడ్డాయి. అలాగే పర్షియా - భారతీయ గ్రంథాల మధ్య విస్తృతంగా ఆదాన ప్రధానాలు జరిగాయి. సంస్కృత గ్రంథాలు, ముఖ్యంగా భగవద్గీత, ఉపనిషత్తులకు ఇతర భారతీయ భాషలతో సాన్నిహిత్యం ఏర్పడి, భక్తి ఉద్యమ కాలంలో గొప్ప భాషాగ్రంథాలు వచ్చాయి. ఉదాహరణకు మరాఠీ సాధు కవి జ్ఞానేశ్వర్ గీతానువాదం, జ్ఞానేశ్వరి. ముఖ్యంగా రామాయణ, మహాభారతం వంటి పురాణ మహాకావ్యాలకు స్వేచ్ఛానువాదాలు వివిధ భాషలలో వచ్చాయి.. ఉదాహరణకు రామాయణానికి పంప, కంబ, మొల్ల ఎళుత్తచ్చన్, తులసీదాస్, ప్రేమానంద, ఏకనాథ్, బాల రామదాసు, మాధవ కందళి లేక కృత్తిదాస్ వంటివారి ఆదత్తాలను చూడవచ్చు.

వలస రాజ్య కాలంలో ఐరోపా - భారతీయ భాషల మధ్య, ముఖ్యంగా సంస్కృతంలో ఆదాన ప్రధానాలు జరిగాయి. జర్మనీ, ఫ్రెంచి, ఇటాలియన్, స్పానిష్ భాషలు, భారతీయ భాషల మధ్య పరస్పరానువాదాలు జరుగుతుండగా, ఇంగ్లిషు భాష, వలస రాజ్య గురువులు ఉపయోగిస్తున్నందు వల్ల ప్రముఖ స్థానాన్ని పొందింది. విలియం జోన్స్ అనువదించిన కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలంతో ఇంగ్లిషులో బ్రిటీషు అనువాద దశ తారా స్థాయికి చేరుకుంది. భారతీయ సాంస్కృతిక గౌరవానికి శాకుంతలం ప్రముఖంగా నిలిచి, భారతీయ చైతన్యాన్ని చాటి చెప్పే ప్రాథమిక గ్రంథాలలో ఒక గుర్తుగా మిగిలింది. 19 వ శతాబ్దంలో దాదాపు పదికి పైగా భారతీయ భాషలలో అనువాదం చేయటానికి గల ప్రాముఖ్యాన్ని ఇదే వివరిస్తుంది. వలసరాజ్య/బ్రిటీషు అనువాద ప్రయత్నాలు ప్రాచ్చ్య సైద్దాంతికతతో నిర్ణయించబడ్టాయి. ఇది కొత్త సూత్రాలను కనుగొనటానికి, వివరించటానికి, వర్గీకరించటానికి, భారతదేశాన్ని నియంత్రించటానికి మాత్రమే. వారు భారతదేశానికి సంబంధించి తమ సొంత అనువాదాలను సృజించుకున్న నేపథ్యంలో, ఆయా గ్రంథాల భారతీయ అనువాదకులు ఇంగ్లిషులోనికి అనువదిస్తున్నది. విస్తరించటానికి, సరిచేయటానికి కొన్నిసార్లు బ్రిటీషు అవగాహనను సవాలు చేయటానికే. ఈ సంగ్రామం సమకాలీన గ్రంథాలపైన మాత్రమే కాకుండా ప్రాచీన గ్రంథాల చుట్టూ జరగటం కూడా కనిపిస్తుంది. భారతీయ మేధావులు చేసిన ఇంగ్లిషు అనువాదాలలో రాజారామమోహనరాయ్ అనువదించిన శంకరుని వేదాంతం కేణ ఈశవ్యాసోపనిషత్తులు మొట్టమొదటివి. ఈ మార్లంలోనే ఆర్.సి.దత్త ఋగ్వేద, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం మరికొన్ని సంస్కృత నాటకాలు వచ్చాయి. ఈ అనువాదాలు, భారతీయులు లోబడిన, వంగిన తత్వం గలవారిగా చిత్రించిన కాల్పనిక, ఉపయోగితావాద ఉద్దేశాలకు సవాళ్లుగా నిలిచాయి. తదనంతరం ఒక వరదలాగా ఇటువంటి అనువాదాలు వచ్చాయి. వీటిలో దీనబంధు మిశ్రా, అరబిందో, రవీంద్రనాథ్ ఠాగూర్ల అనువాదాలు కొన్నింటిని పేర్కొనవచ్చు. తక్కువగానే అయినప్పటికీ ఈ కాలంలోనే భారతీయ భాషలమధ్య అనువాదాలు ప్రారంభమయ్యాయి.

వాస్తవమేమయినప్పటికీ, ఇంకా ఇంగ్లిషు భారతదేశంలో అత్యధిక అక్షరాస్యులకు సహితం అందుబాటులో లేనిదిగా ఉంది. ఈ వర్గాలకు నిజమైన సాధికారత, సాహితీ ప్రాముఖ్యతగల అనువాదాలద్వారా, జ్ఞాన గ్రంథాలను భారతీయ భాషలోనికి అనువదించటం ద్వారా మాత్రమే సాధ్యం. అనువాదానికి సంబంధించి గాంధీగారి అభిప్రాయాలు ఇక్కడ సరైనవేమోనని అనిపిస్తుంది. “నేను అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్య భాషగా ఇంగ్లిషును పరిగణిస్తాను. అందువలన కొంతమందికి ఇంగ్లిషు నేర్చుకోవటం అవసరమే. ఇంగ్లిషులో పాండిత్యం గలవారిని ఇంగ్లిషు సాహిత్యంలో ప్రఖ్యాత గ్రంథాలను దేశీయ భాషలలోకి అనువదించేలా నేను ప్రోత్సహిస్తాను”. ఆయన ఇంకా, ఇంగ్లిషును మాధ్యమ విద్యగా ఆదత్తం చేసుకోవటం వలన భారతీయ భాషల అభివృద్ధికి ఆటంకమవుతుందేమోనని భావించారు.

ఎల్.ఎమ్. ఖుబ్‌చందాని చెప్పినట్లుగా, పూర్వ వలసవాద భారతదేశంలో విద్యావిధానం మక్తాబులు , పాఠశాలలద్వారా పనిచేస్తూ ఉంది. పాఠశాల విద్య ప్రాథమిక సామాజికీకరణకు విస్తృతరూపమే కాకుండా భాషా వైపుణ్యాల క్రమానుగతిని నిర్మించటానికి ఉపకరించేదిగా భావించ బడింది. ఇది స్థానిక మాండలికాల నుంచి తరచు కించపరిచే మేధోధోరణుల వరకూ గల పరస్పరావగాహన స్పష్టమైన వైవిధ్యభరిత భాషా వ్యవహారాల వరుసను పెంపొందించటానికి దోహదపడింది. అనేక వ్యవహారికా ప్రధానమైన భాషలూ లిపులు, నేర్వరులకు సమృద్ధియైన ప్రవాహిత భాషా ప్రదర్శన పట్టికని ఇస్తుంది. భారతీయసంప్రదాయ వైవిధ్యంతో కొంత అసౌకర్యం ఉన్నా, భారతీయ విద్యావిధానానికి అద్వైతావాద పరిష్కారాలను వలసవాదపాలకులు సూచించినప్పటికీ, ఇంగ్లిషుకూ భారతీయ భాషలకు మధ్య ఇది వ్యతిరేకతను సృష్ఠించడమే అవుతుంది. భారతీయ విద్యావిధానం పై మెకాలే చర్చించిన అంశాలు (1835), ఆయనకు ముందున్న ఇంగ్లిషు విద్యావేత్తలు భారతీయభాషలను నిర్లక్ష్యం చేశారు. మాతృభాషల బోధనా మాద్యమంపై అధికంగా వత్తిడి పెరుగుతున్న అవసరానికి వలసరాజ్య పాలనోత్తర కాలం సాక్షీభూతంగా నిలిచింది. మానసికంగా సామాజికంగా, విద్యాపరంగా బాల బాలికలు చక్కగా వేగతరంగా వారివారి మాతృభాషల ద్వారా నేర్చుకుంటారన్న యునెస్కో సి ఫారసును అనేక మంది భాషా ప్రణాళికా అధికారులు నొక్కిచెప్పారు.

కనుక, సమాజంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ భాషలకు మన సమాజంలోను, మన పాఠశాలలోనూ ఒక స్థానాన్ని కల్పించవలసిన అవసరం ఉంది. సాహిత్య, జ్ఞాన గ్రంథాల అనువాదాలు సమృద్ధిగా ఉపాధ్యాయులకూ, విద్యార్థులకూ అందుబాటులో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది, అలాగే పాశ్చాత్య ‘దాత’ భాషలనుకుంటున్ననాటి నుండి ఇటువంటి గ్రంథాల అనువాదాలను ‘నిలువు’ విధానంలో దిగుమతి చేసుకోవడంకంటే ఒక భారతీయ భాషనుండి మరొక భారతీయ భాషలోనికి ‘సమాంతర అనువాదం’ చేయటం కూడా ఎంతో ముఖ్యం (సింగ్.1990).

తమ మాతృభాషల ద్వారా అత్యున్నతమైన జ్ఞానం అందుబాటులోకి వస్తుందన్న ఆసక్తితో ఎదురుచూస్తున్న భారతదేశంలోని సాధారణ స్త్రీ పురుషులకు కూడా ఈ జ్ఞానం లభిస్తుందని మా గట్టి నమ్మకం. ఈ సాధారణ ఆలోచనా నేపథ్యంతోనే జాతీయ అనువాద సమితి ఆవిర్భవించింది.